విజయవాడ, జూలై 25, 2024: ఏపీలో మందబాబులకు అలర్ట్.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు.. కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం, బార్ల విధానాన్ని తీసుకొస్తామని.. నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణలతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని.. మద్యం ధరల్ని సమీక్షించి, పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖను పునర్‌వ్యవస్థీకరిస్తామని.. వారిపై ఒకే విభాగం పర్యవేక్షణ ఉంచుతామని సీఎం తెలిపారు.
telugu.samayam.com లో ప్రచురించబడిన నివేదికల ప్రకారం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు అనుమతిచ్చి ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా తీసుకొచ్చిన రుణాలపై సమీక్షిస్తామన్నారు సీఎం చంద్రబాబు. మద్యం ఉత్పత్తి, సరఫరా అన్నిచోట్ల నాణ్యంగా ఉండేలా పర్యవేక్షణ పెంచుతామని.. దీనికి సంబంధించి అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మద్యం కొనుగోలుకు పారదర్శక విధానాన్ని అమలు చేస్తామని.. నాటుసారా, టాక్స్‌లు చెల్లించని మద్యాన్ని అరికడతామన్నారు. అంతేకాదు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తామని.. డి అడిక్షన్ సెంటర్లు, పునరావాస కేంద్రాల సంఖ్య పెంచుతామని.. ఉన్నవాటిని మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం స్కాంతో పోలిస్తే చాలా పెద్దది అన్నారు చంద్రబాబు. మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని.. డిస్టిలరీలు, బ్రూవరీల్లో తయారైన మద్యాన్ని నేరుగా షాపులకు పంపి, తద్వారా వచ్చిన నగదును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. షాపుల్లో మద్యం విక్రయించిన సొమ్మును మరుసటి రోజు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉండగా నాలుగైదు రోజులు డిపాజిట్లు చేయలేదన్నారు. ఈ డబ్బులన్నీ కొందరి జేబుల్లోకి వెళ్లాయని.. ఇలా చూస్తే రూ.వేల కోట్లలో దోపిడీ జరిగే అవకాశం ఉంటుంది అన్నారు చంద్రబాబు. ఈ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ లావాదేవీలు దేశంలో పెరిగాయన్నారు చంద్రబాబు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో చాలాకాలం వరకు డిజిటల్ లావాదేవీల విధానం ప్రవేశపెట్టలేదన్నారు. ఆ తర్వాత హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో అప్పుడు డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సహకారం కూడా తీసుకుంటామని.. వారికి కేసు రిఫర్ చేస్తామని తెలిపారు. ఏపీలోని మద్యం కుంభంకోణం.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదన్నారు ముఖ్యమంత్రి.