కోవిడ్‌-19 టీకా ఆవ‌శ్య‌కం-అపోహ‌లు అవ‌స‌రంలేదు

0
942

ద్వారా ప్రవీణ్ వేలువోలు

కర్నూల్, జూన్ 07, 2021: క‌రోనా మొద‌టి విడ‌త వీడింద‌నుకుంటే, రెండో విడ‌త తీవ్ర భ‌యాందోళ‌న‌లను సృష్టించింది. ఇక‌ మూడో విడ‌త ముందుంద‌నే వార్త‌లు ప్ర‌జ‌లంద‌రికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, కోవిడ్‌ను పూర్తిగా నివారించ‌డానికి ఎంత కాలం ప‌డుతుంది? చేతులు శుభ్రం చేసుకుంటూ, మాస్క్ ధ‌రిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఇంకెంత కాలం ఉండాల‌నే ప్ర‌శ్న‌ ఇప్పుడు అంద‌ర్నీ వేధిస్తోంది. దీనికి ఒక‌టే మార్గం కోవిడ్‌-19 టీకా వేసుకోవ‌డం. అవును, కోవిడ్‌-19 నివార‌ణ‌లో టీకా వేసుకోవ‌డం అవ‌స‌రం మాత్ర‌మే కాదు ఆవ‌శ్య‌కం కూడా. ఇదే విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా క‌చ్ఛితంగా చెబుతోంది. అందులో భాగంగానే, భార‌తదేశంలో విదేశీ టీకాల పంపిణీ చేయ‌డానికి మ‌రోసారి ఇక్క‌డ ప‌రీక్ష‌లు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని ఇటీవ‌ల డ్ర‌గ్ కంట్రోలర్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించారు. అయినా, తాజాగా ఇండియాలో టైమ్స్ సంస్థ చేసిన స‌ర్వేలో 25% మందికి పైగా టీకా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదంటూ తెలిసింది. అలాగే వివిధ క‌మ్యూనిటీల్లోనూ టీకాపై ర‌క‌ర‌కాల సందేహ‌లున్న‌ట్లు వెల్ల‌డ‌య్యింది.

క‌రోనా పూర్తి నివార‌ణ‌కు వ్యాక్సినే మార్గం

నిజ‌మే! క‌రోనా టీకా వేయించుకోవ‌డంలో ఎలాంటి బ‌లవంతంలేదు. అది వ్య‌క్తిగ‌తంగా వారివారి ఇష్టం మేర‌కు వేయించుకునేదే. కానీ, టీకాను అంద‌రూ వేయించుకోవాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లంతా గుర్తించాలి. వ్యాక్సిన్‌ వ‌ల్ల రెండు విధాలా ఉప‌యోగం ఉంటుంది. ఒక‌టి, మ‌ర‌ణాల రేటు త‌గ్గుతుంది. అలాగే, కోవిడ్ కేసులూ త‌గ్గుముహం ప‌డ‌తాయి. ఇటీవ‌లి స‌ర్వేల‌ను గ‌మ‌నిస్తే కోవిడ్‌తో మ‌రణించిన వారిలో 84% మంది 50 ఏళ్ల‌కు పైబ‌డిన‌వారేన‌ని తెలుస్తుంది. ఈ వ‌య‌సు వారిలో మ‌ధుమేహం, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల వంటి వివిధ దీర్ఘ‌కాల వ్యాధులు కూడా ఉండ‌టంతో వీరిలో కోవిడ్ వ్యాధి తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే, ఇలాంటి వారిలో వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గించ‌గ‌లిగితే మ‌ర‌ణాల సంఖ్య‌ను కూడా తగ్గించొచ్చు. ఇక సెకండ్ వేవ్‌లో విజృంభించిన కోవిడ్‌-19 వైర‌స్ భార‌త‌దేశాన్ని ఊపిరి తీసుకోనియ‌లేదు. ఈ ద‌శ‌లో వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అందుకే, దేశ‌వ్యాప్తంగా గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో టీకాలు వేయాలి. అప్పుడే, క‌రోనాను ఎదుర్కొని, స‌హ‌జంగా వ్యాధినిరోధ‌కశ‌క్తిని అభివృద్ధి చేసుకున్న వారితో పాటు టీకా వ‌ల్ల వ్యాధినిరోధ‌క‌త‌ను పెంచుకున్న వారితో క‌లిపి అంద‌రూ సాధార‌ణ జీవ‌న ప‌రిస్థితుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే క‌రోనా నివార‌ణ‌లో ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి టీకాలు తీసుకోవాల్సిందేన‌ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్‌లో ఉండే ప‌దార్ధాల‌పై అపోహ‌లు

వ్యాక్సిన్‌ తీసుకున్న త‌ర్వాత వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి సాధార‌ణంగా అంద‌రిలోనూ అనుమానం ఉంది. అయితే, కోవిడ్‌-19 వ్యాక్సిన్ వ‌ల్ల నొప్పి, వాపు, జ్వ‌రం వంటి చాలా సాధార‌ణ ఇబ్బందులు త‌ప్ప తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌ని నిపుణులు వెల్ల‌డించారు. ఇది కాకుండా, ముందు నుంచీ వివిధ క‌మ్యూనిటీలవారు టీకాపైన ర‌క‌ర‌కాల‌ సంశ‌యాలు వ్య‌క్తం చేస్తున్నారు.
ఇక్క‌డ ముస్లీమ్ క‌మ్యూనీటీతో పాటు హిందువుల్లోనూ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై కొంద‌రు సందేహ‌ప‌డుతున్నారు. యూదుల్లోనూ ఇదే త‌ర‌హా ఆలోచ‌న‌ లేక‌పోలేదు. దీనికి కార‌ణం, త‌మ విశ్వాసాల‌కు వ్య‌తిరేకంగా టీకా త‌యారీలో నిషేధిత ప‌దార్థాలు వాడుతున్నార‌నే అభిప్రాయం.

భార‌త‌దేశంలో క‌రోనా వ్యాక్సిన్ రాక ముందే ఇలాంటి వివాదాలు మొద‌ల‌య్యాయి. ఇస్లామిక్ ఆహార నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తిపాదిత టీకాలు హ‌లాల్ చేయ‌బ‌డ‌లేద‌నే నివేదిక‌లు ముందుకు రావ‌డంతో వారు వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి సుముఖంగా ఉంటారా లేదోన‌నే అభిప్రాయం ఏర్ప‌డింది. కానీ, భార‌త దేశంలోని ముస్లీములే కాదు హిందువులు, యూదులు కూడా ఫైజ‌ర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, భార‌త్ బ‌యోటెక్స్‌వారి కోవాగ్జిన్ అభివృద్ధిచేసిన ప్ర‌తిపాదిత‌ టీకాల్లోని కంపోజీష‌న్‌పై అనుమానాలు వ్య‌క్తం చేశారు. ముస్లీమ్‌లు, యూదులు ఈ టీకాలో పందికి చెందిన‌ ఉత్పత్తులు ఉన్నాయ‌ని అంటుంటే, హిందువులు ఆవు ర‌క్తం క‌లిసిందంటూ సందేహప‌డ్డారు.

సందేహాల కంటే ప్రాణాలే ముఖ్యం

ఇలాంటి అభిప్రాయాల‌న్నింటినీ ఫైజ‌ర్‌, ఆస్ట్రాజెనికా, మోడెర్నా త‌యారీదారులు ఖండించారు. వ్యాక్సిన్ ర‌వాణాలో నిల్వ కోసం జెల‌టిన్ వాడ‌తారు కానీ వ్యాక్సిన్‌లో ఇవేమీ వాడ‌రంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇస్లామిక్ క‌మ్యూనిటీల్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, ముస్లీమ్ దేశాల‌తో స‌హా దాదాపుగా ప్ర‌భుత్వాల‌న్నీ వ్యాక్సిన్ల‌కు అనుమ‌తులిచ్చాయి. యూకేలో అనుమ‌తించిన ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్‌ను అక్క‌డి బ్రిటీష్ ఇస్లామిక్ మెడిక‌ల్ అసోసియేష‌న్ అనుమ‌తించింది. ఇక, భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ ఇస్లామిక్ స్కాల‌ర్ అక్త‌రుల్ వ‌సీ దీనిపై అప్ప‌ట్లోనే స్పందిచారు. ఇస్లామ్‌లో పంది, మ‌ద్యం తిన‌డానికి, తాగ‌డానికి అనుమ‌తి లేదు. నిజ‌మే కానీ, వైద్య‌ప‌రంగా వాటిని వాడొచ్చ‌ని, ప్రాణాల‌కు ముప్పు వాటిల్లుతున్న‌ప్పుడు వీటిని వినియోగించ‌డంలో త‌ప్పులేద‌ని స్ప‌ష్టం చెప్పారు. ఒక‌విధంగా, జ‌మాత్‌-ఈ-ఇస్లామీ సంస్థే మొద‌టిగా ముస్లీములు వ్యాక్సిక్ తీసుకోవ‌చ్చ‌ని చెప్పింది. అలాగే ఆర్థ‌డాక్స్ జ్యూయిష్ క‌మ్యూనిటీ పెద్ద‌లు కూడా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికే మ‌ద్ద‌తు ప‌లికారు.

తెలుగువారంతా మ‌రింత జాగ్ర‌త్త‌!

`సెకండ్ వేవ్‌` క‌రోనాలో దేశ‌వ్యాప్తంగా ఊపిరిపీల్చుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మొద‌ట మ‌హారాష్ట్ర‌లో విజృంభించిన‌ప్ప‌టికీ త‌ర్వాత కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌క్కువ కాలంలోనే ప‌రిస్థితి విష‌య‌మించింది. ఇక్క‌డ‌ కొన్ని గ్రామాల్లో దాదాపుగా అంద‌రికీ క‌రోనా సోకుతున్న ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా క‌ర్ఫ్యూ మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆయా జిల్లాల్లోని మండ‌ల ప‌రిథిలో కోవిడ్ కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నారు అధికారులు. ఇలా ఇంకెంత కొన‌సాగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ముందున్న ప్ర‌ధాన ప‌రిష్కారం కోవిడ్‌-19 వ్యాక్సిన్ వేయించుకోవ‌డ‌మే! దీనితో పాటు క‌రోనా నిబంధ‌న‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించ‌డమే!!